YS Sunitha: అవినాశ్ కు శిక్ష పడాల్సిందే.. అప్పుడు జగన్ పై నాకు అనుమానం రాలేదు: వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
- సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత
- నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలని డిమాండ్
- గొడ్డలితో చంపారనే విషయం జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్న
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని... అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని చెప్పారు.
వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని సునీత ప్రశ్నించారు. ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే నిందితులకు శిక్షలు పడాల్సిందేనని చెప్పారు. జగన్ మీద 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే వివేకా హత్య కేసు కూడా కాకూడదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు వెళదామని జగన్ ని అడిగానని... సీబీఐకి వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడని జగన్ చెప్పారని సునీత తెలిపారు. దీంతో, తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు.