Krish: డ్రగ్స్ కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు క్రిష్

Krish files anticipatory bail petion in Telangana High Court
  • టాలీవుడ్ ను వెంటాడుతున్న డ్రగ్స్ భూతం
  • హోటల్ రాడిసన్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు 
  • హోటల్ రాడిసన్ కు క్రిష్ కూడా వచ్చినట్టు గుర్తింపు
  • నేడు విచారణకు రావాలన్న పోలీసులు
  • ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన క్రిష్
హైదరాబాద్ లోని హోటల్ రాడిసన్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో ఇదే హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ వెళ్లినట్టు, పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. 

డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. క్రిష్ ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు క్రిష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 

డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రిష్ స్పష్టం చేశారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  క్రిష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని గచ్చిబౌలి పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో గజ్జల వివేకానంద్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. వివేకానంద్ వీకెండ్ లో హోటల్ కు వచ్చేవాడని, అతడు ఇచ్చే పార్టీలకు సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా వచ్చేవారని ప్రాథమికంగా గుర్తించారు. 

రాడిసన్ హోటల్ లో 200 సీసీ కెమెరాలు ఉండగా, వాటిలో 20 మాత్రమే పనిచేస్తున్న స్థితిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చాలా కేసులను సీసీ టీవీ ఫుటేజి సాయంతో ఛేదిస్తుంటారు. కానీ ఈ కేసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారనుంది.
Krish
Anticipatory Bail
Petition
TS High Court
Radison Drugs Case
Hyderabad
Tollywood

More Telugu News