Kishan Reddy: ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి
- తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి
- ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య
- మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందని అన్నారు. పిల్లల భవిష్యత్తు, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో దేశాన్ని మోదీ ఎలా కాపాడారో అందరం చూశామని అన్నారు. హైదరాబాద్ వారాసిగూడలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం చాలా ప్రశాంతంగా మారిందని... ప్రపంచ దేశాలు సైతం భారత్ ను పొగిడేలా మోదీ చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. అన్ని సర్వేలలో మోదీనే బెస్ట్ నేతగా ఉన్నారని చెప్పారు. దేశంలో ప్రతి మహిళకు వంట గ్యాస్ అందించిన ఘనత మోదీదని అన్నారు. అందరి కడుపు నింపడానికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదేళ్ల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ పంపిణీ చేయనున్నారని తెలిపారు.
2జీ, బొగ్గు కుంభకోణాల్లో రూ. 12 లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ దోపిడీని భరించలేక, అవినీతి రహిత పాలకుడు కావాలని మోదీని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో మోదీని మరోసారి ఆశీర్వదిద్దామని చెప్పారు.