Murugudu Lavanya: మంగళగిరి ఇన్చార్జిగా మాజీ మంత్రి కోడలు... నెల్లూరు లోక్ సభ బరిలో విజయసాయి... వైసీపీ 9వ జాబితా విడుదల
- నారా లోకేశ్ పై పోటీకి మురుగుడు లావణ్యకు అవకాశం
- ఇవాళ రాత్రి 7 గంటలకు వైసీపీలో చేరిన లావణ్య
- కొన్ని గంటల్లోనే ఇన్చార్జిగా నియామకం
విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న అధికార వైసీపీ నేడు 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లే ఉన్నప్పటికీ, అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి.
మంగళగిరిలో నారా లోకేశ్ కు పోటీగా గతంలో గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్... నేడు కొత్త ఇన్చార్జిని తీసుకువచ్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను కొత్త ఇన్చార్జిగా ప్రకటించారు. మురుగుడు లావణ్య ఇవాళ రాత్రి 7 గంటలకు వైసీపీలో చేరగా, కొన్ని గంటల్లోనే ఆమె పేరు అభ్యర్థుల జాబితాలో చేర్చారు. మురుగుడు లావణ్య ఎవరో కాదు... మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు.
ఇక, నెల్లూరు ఎంపీ స్థానానికి విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు లోక్ సభ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న వైసీపీ చివరికి విజయసాయికి అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతోంది. కర్నూలు వైసీపీ ఇన్చార్జిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ పేరును ప్రకటించారు.
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ఈసారి అవకాశం నిరాకరించిన వైసీపీ నాయకత్వం... ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్ ను కర్నూలు ఇన్చార్జిగా నియమించింది.