Joe Biden: మళ్లీ తడబడ్డ అమెరికా ప్రెసిడెంట్.. వీడియో ఇదిగో!

Biden confuses Gaza with Ukraine twice while announcing aid airdrops

  • ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అమెరికా
  • మానవతా సాయం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ విమానాల వాడకం
  • గాజాకు బదులు ఉక్రెయిన్ లో ఆహార పొట్లాలు జారవిడుస్తామన్న బైడెన్

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఆయన విమర్శకులు మరోసారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడడంతో ఆయన జ్ఞాపకశక్తి క్షీణించిందని, అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడానికి బైడెన్ ఫిట్ కారని ఆరోపిస్తున్నారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం సరికాదని అంటున్నారు. వ్యక్తుల పేర్లు కూడా గుర్తుంచుకోలేకపోతున్న బైడెన్.. అధ్యక్ష బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తడబడి మీడియాకు చిక్కిన ప్రెసిడెంట్ బైడెన్.. తాజాగా ఓ మీడియా సమావేశంలో మళ్లీ తడబడ్డారు. గాజాను ఉక్రెయిన్ గా పొరబడ్డారు. గాజాకు మానవతా సాయం చేస్తామంటూ ప్రకటించే క్రమంలో రెండుసార్లు గాజా స్థానంలో ఉక్రెయిన్ పేరును పలికారు.

ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా చితికిపోయింది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఇటీవల మానవతా సాయంగా ఐక్యరాజ్య సమితి పంపిన ట్రక్కుల వద్దకు జనం ఎగబడ్డారు. వందల సంఖ్యలో జనం పరుగులు పెడుతూ రావడంతో ఇజ్రాయెల్ సైన్యం పొరబడింది. వారు దాడికి వస్తున్నారని భావించి కాల్పులు జరపడంతో 104 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో గాజాలో ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలోనే గాజాకు మానవతా సాయం చేస్తామని, విమానాల ద్వారా ఆహార పొట్లాలు గాజా స్ట్రిప్ లో జారవిడుస్తామని అమెరికా ప్రకటించింది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేస్తూ.. ‘ఉక్రెయిన్ (గాజా) లో ఆహార పొట్లాలు జారవిడుస్తాం. ఉక్రెయిన్ కు ఇతర మార్గాల ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తాం. సముద్ర మార్గంలో మానవతా సాయం చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తాం’ అని అన్నారు. గాజాకు సాయం చేస్తామని ప్రకటించే క్రమంలో బైడెన్ పొరబడి ఉక్రెయిన్ కు సాయం చేస్తామంటూ ప్రకటించడంతో ఆయన మానసిక స్థితిపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News