G. Kishan Reddy: కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు... రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నాం: కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ హయాంలో ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలికే సంప్రదాయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శ
- ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్న కిషన్ రెడ్డి
- మేడిగడ్డకు అందరికంటే ముందు వెళ్లింది బీజేపీయే అన్న కేంద్రమంత్రి
ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో స్వాగతం పలికే సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో తుంగలో తొక్కారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని భావిస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్నారు.
రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భంలో గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయమని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మాట్లాడుతూ... అందరికంటే ముందుగా తామే అక్కడకు వెళ్లామని గుర్తు చేశారు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సరైనదే అన్నారు.