Atchannaidu: సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
- రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు
- ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి
- గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
రాష్ట్రంలో సురక్షిత తాగునీరు లభించక ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమని తన లేఖలో పేర్కొన్నారు. కనీసం ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించండి అని సీఎం జగన్ కు హితవు పలికారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.