BJP: లోక్ సభ ఎన్నికలకు 195 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల... వారణాసి నుంచి మళ్లీ ప్రధాని మోదీ పోటీ

PM Modi to contest Varanasi seat and Amit Shah among 195 names released
  • గాంధీ నగర్ నుంచి అమిత్ షా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ  
  • యువతకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత
  • తెలంగాణ నుంచి 9 మందికి సీట్ల ఖరారు  
రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసోంలోని 14 లోక్ సభ స్థానాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అసోం సీఎం శరబానంద సోనోవాల్ కూడా దిబ్రూఘర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

బెంగాల్ నుంచి ఇరవై, మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు, గుజరాత్ నుంచి పదిహేను, రాజస్థాన్ నుంచి పదిహేను, కేరళ నుంచి పన్నెండు, తెలంగాణ నుంచి తొమ్మిది, అసోం, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు సీట్ల చొప్పున, ఢిల్లీ నుంచి ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిసూర్ నుంచి సురేశ్ గోపి, గాంధీ నగర్ నుంచి అమిత్ షా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ సహా 9 మందికి టిక్కెట్లు ఖరారయ్యాయి.
BJP
Narendra Modi
Bandi Sanjay
Telangana
dharmapuri arvind

More Telugu News