Ashwani Vaishnav: కంటకాపల్లి జంక్షన్ వద్ద రైలు ప్రమాదానికి కారణాన్ని ప్రకటించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
- పలాస రైలు పైలట్, సహాయక పైలెట్ సెల్ఫోన్లో క్రికెట్ చూస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణమన్న రైల్వే మంత్రి
- దర్యాప్తు రిపోర్ట్ రాకముందే ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని వెల్లడి
- రైల్వే శాఖలో కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన అశ్వనీ వైష్ణవ్
గతేడాది అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనకు గల కారణాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం ప్రకటించారు. లోకో పైలట్, సహాయక లోకో పైలట్ ఇద్దరూ మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైలు నడిపించడమే ప్రమాదానికి దారితీసిందని తెలిపారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో ఒకటైన ‘పలాస ప్యాసింజర్’ పైలట్లు ఈ నిర్వాకానికి పాల్పడ్డారని అన్నారు. క్రికెట్ చూస్తూ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టలేదని వివరించారు. ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే దర్యాప్తు కమిటీ వేశామని ప్రస్తావించారు. రిపోర్ట్ రాకముందే లోకో పైలట్, సహాయ లోకో పైలట్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
కంటకాపల్లి ప్రమాదం నేపథ్యంలో ఇకపై విధుల్లో ఉన్న పైలట్ల పనితీరును నిశితంగా గమనించే వ్యవస్థను తీసుకొచ్చామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. రైల్వే శాఖలో కొత్త భద్రతా చర్యలపై ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. ఈ క్రమంలో కంటకాపల్లి ప్రమాదాన్ని ప్రస్తావించారు. కాగా 2023లో అక్టోబరు 29న కంటకాపల్లి వద్ద ఈ రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం వేచివున్న రాయగడ ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోగా, దాదాపు 50 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.