Nimmakayala Chinarajappa: రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్య.. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణ
- కాకినాడలో మీడియా సమావేశం
- సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తానని సునీత అంటే జగన్ ఎందుకు ఆపారని ప్రశ్న
- తొలుత సీబీఐ విచారణ కావాలన్న జగన్ తరువాత వద్దనడం వెనక మతలబు ఉందని వ్యాఖ్య
- జగన్ పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్
రాజకీయ లబ్ధి కోసం వివేకానంద్ రెడ్డి హత్య జరిగిందని పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
‘‘రాజకీయ లబ్ధి కోసమే వివేకానంద రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలివేటుతోనే బాబాయ్ చనిపోయారని సీఎం అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు? సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తానని సునీత అంటే జగన్ ఎందుకు ఆపారు? హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన ఆయన..ఆ తరువాత వద్దనడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో ప్రజలకు చెప్పాల్సిందే. వివేకా ఎలా చనిపోయారో సీఎంకు తెలుసు. దానిని ఎందుకు దాచాలనుకుంటున్నారు? తండ్రిని హత్య చేసిన కేసులో తనకు న్యాయం చేయాలని సునీత పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్టు చేయకుండా జగన్ అడ్డుకుంటున్నారు’’ అని చినరాజప్ప విమర్శించారు. సునీత పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీకి బదులు అభివృద్ధి సంక్షేమాన్నిచ్చే టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు.