Sajjala Ramakrishna Reddy: అందువల్లే పవన్ టార్గెట్ అవుతున్నాడు: సజ్జల
- గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతం అయిందన్న సజ్జల
- అందుకే జగన్ వై నాట్ 175 అంటున్నారని వెల్లడి
- దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా జగన్ పాలన నిలిచిపోతుందని వ్యాఖ్యలు
- పవన్ కు సొంత అజెండా లేదని విమర్శలు
- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతుంటాడని స్పష్టీకరణ
గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతం అయిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పలువురు సీనియర్ జర్నలిస్టులతో ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు సూటిగా అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానాలు ఇచ్చారు.
2019 ఎన్నికల సమయంలో... చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు జగన్ పై కొత్త ఆశలు నిలుపుకుని వైసీపీకి అవకాశం ఇచ్చారని వివరించారు. కరోనా సంక్షోభం కొనసాగిన రెండేళ్ల కాలం తీసేసినా, ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం... ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా జగన్ పాలన నిలిచిపోతుందని సజ్జల వివరించారు. అందుకే సీఎం గారు వై నాట్ 175 అంటున్నారు... దాన్నే మేం రిపీట్ చేస్తున్నాం అని తెలిపారు.
ఇక, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ గురించి ఓ జర్నలిస్టు సజ్జలను అడిగారు. పవన్ కల్యాణ్ బలవంతుడా, బలహీనుడా అని ప్రశ్నించారు. ఆయన బలం చూడాల్సిన అవసరం తమకేంటని సజ్జల బదులిచ్చారు. పవన్ బలవంతుడు కాకపోతే ఆయనను అంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సదరు జర్నలిస్టు తన ప్రశ్నను మరో కోణంలో సంధించారు.
అందుకు సజ్జల స్పందిస్తూ... చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమే తన అజెండా అన్నట్టుగా పవన్ వైఖరి ఉందని విమర్శించారు. పవన్ కు ఒక సొంత అజెండా లేదని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నాడని, అందువల్లే పవన్ ఎక్కువగా టార్గెట్ అవుతున్నాడని వివరించారు.
షర్మిల అంశాన్ని ప్రస్తావిస్తూ... ఇంట్లో వాళ్లకే న్యాయం చేయని వ్యక్తి, ప్రజలకేం న్యాయం చేస్తాడని ప్రజలు అడిగితే బాగానే ఉంటుందని, కానీ చంద్రబాబు ఆ ప్రశ్న అడగడం ఏంటని సజ్జల పేర్కొన్నారు. షర్మిల అంటున్న మాటలను చంద్రబాబు చిలకపలుకుల్లా పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు అలా మాట్లాడాల్సిన అవసరంలేదని అన్నారు.