Dharmapuri Arvind: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న ప్రచారంలో నిజం లేదు: ధర్మపురి అర్వింద్
- ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ధర్మపురి అర్వింద్
- ఈసారి తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరుగుతాయని వెల్లడి
- రాష్ట్రంలో 8-10 సీట్లు గెలుస్తామని ధీమా
- కవితపై ఈడీ విచారణకు బీజేపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ మీడియా చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీకి ఓట్లు, సీట్లు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ 8-10 సీట్ల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
ఇక, కల్వకుంట్ల కవితపై ఈడీ కేసులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అర్వింద్ ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో కవిత కేసుల వాయిదాలకు బీజేపీ ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేస్తారని తాను అనలేదని, ఈడీ తన పని తాను చేసుకుపోతోందని, ఇందులో ఎవరి జోక్యం ఉండదని పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐని తాము ఏ సందర్భంలోనూ వాడుకోలేదని చెప్పారు. ఒకవేళ బండి సంజయ్ ఏవైనా వ్యాఖ్యలు చేస్తే, వాటికి ఆయనే సమాధానం చెబుతారని అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ పై అధిష్ఠానానికి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ టర్మ్ అయిపోయినందునే ఆయనను మార్చారని వివరించారు.
రూ.1.10 లక్షల కోట్ల నల్లధనాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీజ్ చేశాయని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించి, పార్టీలో చేర్చుకుని కేసులు మాఫీ చేస్తున్నారనడం సరికాదని అర్వింద్ అన్నారు.