Narendra Modi: నేడే మోదీ తెలంగాణ టూర్
- నేడూ, రేపు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన
- రూ. వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
- ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా రానున్నారు.
నేడు ప్రధాని మోదీ ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి-ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. దాదాపు 43 ఏళ్ల తరువాత ఒక ప్రధాని జిల్లాలో పర్యటిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి
రేపు (మంగళవారం) ప్రధాని సంగారెడ్డిలో పర్యటించనున్నారు. తొలుత బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ ఆ తరువాత రూ.9 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై కూడా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్-2, ఘట్కేసర్ - లింగంపల్లి కొత్త ఎంఎంటీఎస్‌ను ప్రారంభిస్తారు.