Justice Abhijit Gangopadhyay: రాజకీయాల్లోకి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి.. ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానన్న జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్
- ఆయన బీజేపీ తరపున పోటీ చేయబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు
- రేపు రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడి
- అంతరాత్మ ప్రబోధానుసారమే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజీత్ గంగోపాధ్యాయ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చిన ఆయన రాజకీయాల్లో కాలుమోపేందుకు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) తాను రాజీనామా చేయనున్నానని, ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు.
రాష్ట్రంలోని తమ్లూక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి సువేందు అధికారి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు ఆయన సోదరుడు దిబ్వేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజకీయ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న జస్టిస్ అభిజీత్.. తన అంతరాత్మ ప్రబోధానుసారం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ‘‘కలకత్తా హైకోర్టు జడ్జి పోస్టుకు రాజీనామా చేస్తున్నాను. అంతరాత్మ ప్రబోధానుసారమే ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ప్రజా సమూహంలోకి, విశాల ప్రపంచంలోకి వెళ్లాల్సిన అవసరముంది. జడ్జిగా నా ముందు వచ్చిన కేసులను మాత్రమే పరిష్కరించగలను. కానీ, దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది ప్రజాలు నిస్సహాయంగా ఉన్నారు’’ అని జస్టిస్ అభిజీత్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో 2022లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది జస్టిస్ గంగోపాధ్యాయనే. కలకత్తా హైకోర్టులో లా ప్రాక్టీస్ చేసిన ఆయన ఆ తర్వాత అదే కోర్టులో అడిషనల్ జడ్జిగా చేరారు. 30 జులై 2020లో శాశ్వత జడ్జిగా నియమితులైనట్టు హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంది.