KTR on LRS: ఎల్ఆర్ఎస్ కట్టొద్దన్నారు కదా.. ఇప్పుడు ఎలా అడుగుతున్నారు?: కేటీఆర్

BRS Working President KTR Press Meet at Telangana Bhavan
  • ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారని ఆరోపణ
  • ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉచితంగా చేస్తామన్నారని గుర్తుచేసిన కేటీఆర్
  • ఈ నెల 6న అసెంబ్లీ ముందు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా
కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్టేనని చెప్పకనే చెబుతోందని అన్నారు. దీనికి ఎల్ఆర్ఎస్ ను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కట్టొద్దన్న నేతలే నేడు గడువు విధించి మరీ వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు.

ఎల్ఆర్ఎస్ అన్యాయమని, ప్రజల రక్తం తాగడమేనని, వేల కోట్లు దోచుకోవడానికేనని ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆరోపించిన భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కష్టపడి దాచుకున్న సొమ్ముతో ప్రజలు కొనుక్కున్న ప్లాట్ లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయనే ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేనని చెబుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు భట్టి, సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎల్ఆర్ఎస్ పై మాట్లాడిన వీడియోలను కేటీఆర్ మీడియాకు చూపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ విధానంపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేనని ప్రభుత్వం అనధికారికంగా గడువు విధించినట్లు తమకు సమాచారం ఉందని, దీనిపై పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ గతంలో కాంగ్రెస్ చేసిన డిమాండ్ ను ఇప్పుడు వారికే వినిపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఈ నెల 6న అసెంబ్లీ ముందు, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని, పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

KTR on LRS
BRS Dharna
Congress
Bhatti
seethakka
LRS

More Telugu News