Viksit Bharat: వికసిత్ భారత్ 2047 ప్రణాళిక.. 100 రోజుల ఎజెండాపై ప్రధాని మోదీ చర్చ
- మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుసరించాల్సిన 100 రోజుల ఎజెండాపై చర్చ
- వికసిత్ భారత్ రోడ్‌మ్యాప్‌లో సమగ్రమైన బ్లూప్రింట్, ఆకాంక్షలు, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు
- 2 లక్షలకు పైగా యువత నుంచి సలహాల స్వీకరణ
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047లో భాగంగా 100 రోజుల ఎజెండాపై ప్రధానంగా చర్చించారు. 2024 మేలో ఏర్పడే కొత్త ప్రభుత్వం.. ఆ తర్వాత త్వరితగతిన అనుసరించాల్సిన 100 రోజుల ప్రణాళికపై ఈ భేటీలో చర్చించడం జరిగింది. ఇక వికసిత్ భారత్-2047 ప్రణాళికలో భాగంగా దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేది మోదీ ఆలోచన. 2047 నాటికి భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తి అవుతాయి.
ఇలా వందేళ్ల స్వాతంత్ర్య భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడమే ఈ వికసిత్ భారత్ ప్రణాళిక. దీనిలో భాగంగా ఆర్ధిక అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జీవన సౌలభ్యం, సులభతరమైన వ్యాపారం, మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమంతో పాటు మరికొన్ని కీలక అంశాలను జోడించడం జరిగింది. అలాగే వికసిత్ భారత్ రోడ్‌మ్యాప్‌లో సమగ్రమైన బ్లూప్రింట్, ఆకాంక్షలు, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు పొందుపరిచారు. దీనిలో భాగంగా ప్రభుత్వం 2 లక్షలకు పైగా యువత నుంచి సలహాలను కూడా స్వీకరించడం జరిగింది. ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంలో 2047 నాటికి దేశాన్ని 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) గా మార్చడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.