Nara Lokesh: జగన్ ముసుగు తీసేశారు... అందుకే నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు: లోకేశ్

Lokesh reacts on police raids in TDP leaders residences
  • నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడులు
  • రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న లోకేశ్
  • అందుకే జగన్ తన ఫ్యాక్షన్ పోకడలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శలు
  • రాష్ట్రానికి ఈసీ పరిశీలకుడిని పంపాలని విజ్ఞప్తి
నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ముసుగు తీసేశారని, ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ నియంతృత్వ పోకడలను భరించలేక ఇటీవల నెల్లూరు జిల్లా సీనియర్ నేతలు టీడీపీలోకి వస్తున్నారని, ఈ పరిణామాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని అన్నారు. విజితారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మంల ఇళ్లకు పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేశ్ ఆరోపించారు. 

పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాష్ట్రానికి ఈసీ పరిశీలకుడిని పంపాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని పేర్కొన్నారు. జగన్ తొత్తులుగా మారిన కొందరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Nara Lokesh
TDP Leaders
Police
Nellore District

More Telugu News