Narendra Modi: బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ఎలాంటి మార్పు లేదు: ప్రధాని మోదీ
- మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అన్న మోదీ
- కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందని ఆరోపణ
- 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని వ్యాఖ్య
త్వరలో జగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను గెలవాలని ప్రధాని అన్నారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ... ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవ సభ అని చెప్పారు. 15 రోజుల వ్యవధిలో 5 ఎయిమ్స్ లను ప్రారంభించామని తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని చెప్పారు.
మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని మోదీ అన్నారు. దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని... ఇందులో ఒకటి తెలంగాణలో పెడుతున్నామని చెప్పారు. తెలంగాణలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్శిటీని స్థాపించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని... ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. గతంలో మీరు తిన్నారు... ఇప్పుడు మేం తింటాం అనే రీతిలో కాంగ్రెస్ ఉందని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని... ప్రజల కలలను సాకారం చేసేందుకు తాను పని చేస్తానని అన్నారు.