Narendra Modi: ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ప్రధాని మోదీ

PM modi welcomes top court order overruling immunity to lawmakers in bribery cases
  • తీర్పును స్వాగతిస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని
  • సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించిన మోదీ
  • స్వచ్ఛమైన రాజకీయాలకు భరోసా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్
చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ఓట్లు వేయడానికి లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. గౌరవప్రదమైన సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని,  ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలకు భరోసా ఇస్తుందన్నారు. అదేవిధంగా వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటు వేయడానికి, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పక్కన పెట్టేసింది.

పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం రక్షింపబడదని పేర్కొన్న న్యాయస్థానం.. 1998 నాటి తీర్పు వివరణ రాజ్యాంగంలోని 105, 194 ఆర్టికల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు భయం లేకుండా పనిచేసేందుకు ఈ రెండు అధికరణలు వారికి ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన మినహాయింపును అందిస్తాయి. పీవీ నరసింహారావు కేసు తీర్పుతో తాము విభేదిస్తున్నట్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటులో ఓటు వేసేందుకు, లేదంటే ప్రసంగించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చట్టసభ్యుడికి మినహాయింపునిస్తూ ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలు కలిగి ఉందని, కాబట్టి దానిని రద్దు చేసినట్టు సీజేఐ స్పష్టం చేశారు. 

అసలింతకీ ఏంటా కేసు?
జులై 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ప్రభుత్వానికి అనుకూలంగా 265, వ్యతిరేకంగా 251 ఓట్లు రావడంతో ప్రభుత్వం స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఇది జరిగిన ఏడాది తర్వాత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు పీవీ నరసింహారావు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 1998లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పైన పేర్కొన్న రెండు అధికరణల ద్వారా ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు లభిస్తున్నట్టు పేర్కొంది. కాగా, తాజా తీర్పులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నాటి తీర్పుతో విభేదించింది. పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం కేసులో చట్టసభ్యులు మినహాయింపు పొందలేరని స్పష్టంగా తీర్పు చెప్పింది.
Narendra Modi
Supreme Court
Lawmakers bribery cases
MPs
MLAs

More Telugu News