SRH: మార్చి 22 నుంచి ఐపీఎల్... హైదరాబాద్ లో వాలిపోతున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు
- ఐపీఎల్ తాజా సీజన్ కు సన్నాహాలు
- ప్రాక్టీసు షురూ చేస్తున్న సన్ రైజర్స్
- ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్ నేతృత్వంలో సన్ రైజర్స్
- మార్చి 23న కోల్ కతాతో తొలి మ్యాచ్ ఆడనున్న సన్ రైజర్స్
కొత్త కెప్టెన్, కొత్త కోచ్ తో ఈసారి ఐపీఎల్ లో సత్తా చాటాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఉరకలేస్తోంది. సన్ రైజర్స్ సారథిగా ఆసీస్ స్టార్ ప్యాట్ కమిన్స్ ను నియమించిన యాజమాన్యం... కోచ్ గా కివీస్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరీని తీసుకువచ్చింది. బౌలింగ్ కోచ్ గా న్యూజిలాండ్ కే చెందిన జేమ్స్ ఫ్రాంక్లిన్ బాధ్యతలు స్వీకరించాడు. జట్టుకు కొత్త రూపం వచ్చిన నేపథ్యంలో, ఐపీఎల్-2024లో సరికొత్త సన్ రైజర్స్ ఆవిష్కృతం కావడం ఖాయమని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక, ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, సన్ రైజర్స్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ మేరకు సన్ రైజర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పేర్కొంది. హోమ్ కమింగ్ కాదు... ఫ్లేమ్ కమింగ్ అంటూ రగిలే కాంక్షను వెల్లడించింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.
కమిన్స్, ట్రావిస్ హెడ్, మార్ క్రమ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో యన్సెన్, వనిందు హసరంగ వంటి విదేశీ ఆటగాళ్లతో సన్ రైజర్స్ బలంగా కనిపిస్తోంది. స్వదేశీ ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఉనద్కట్ గమనించదగ్గ ఆటగాళ్లు.
ఐపీఎల్-2024 సీజన్ కోసం సన్ రైజర్స్ జట్టు ఇదే..
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఐడెన్ మార్ క్రమ్, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అన్మోల్ ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వనిందు హసరంగ, మార్కో యన్సెన్, గ్లెన్ ఫిలిప్స్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ సింగ్, ఫజల్ హక్ ఫరూఖీ, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కట్, జాతవేద్ సుబ్రమణియన్, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్.