Jayaho BC Sabha: నేటి మధ్యాహ్నం జయహో బీసీ సభ.. బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్

Jayaho BC Sabha Opp Nagarjuna University Mangalagiri Guntur

  • మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ
  • లోకేశ్, బాలకృష్ణ సహా హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి నేతలు
  • మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగియనున్న సభ
  • 300 మంది ప్రతినిధులు కూర్చునేలా వేదిక
  • విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాదెండ్ల 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నేటి సాయంత్రం తెలుగుదేశం-జనసేన కూటమి ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ జరగనుంది. రెండు పార్టీల అధ్యక్షులు హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభలో ఉమ్మడి ‘బీసీ డిక్లరేషన్’ను విడుదల చేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. వేదికపై దాదాపు 300 మంది ప్రతినిధులు కూర్చునేలా తీర్చిదిద్దారు.

నిన్న సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను డిక్లరేషన్ ద్వారా ఇరువురు అధినేతలు ప్రకటిస్తారని తెలిపారు. సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సాధికారిక కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు, లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, చంద్రబాబును కలిసి వివరించిన అంశాలు మొత్తం క్రోడీకరించి డిక్లరేషన్ తయారుచేసినట్టు తెలిపారు. ఈ సభలో లోకేశ్, బాలకృష్ణతోపాటు రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారని తెలిపారు. నేటి జయహో బీసీ సభను విజయవంతం చేయాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News