Gummanur Jayaram: రాష్ట్ర మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
- ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం
- వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా
- మంగళగిరి జయహో సభ సందర్భంగా టీడీపీలో చేరిక
- బర్తరఫ్ కు సిఫారసు చేసిన సీఎం జగన్
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాజ్ భవన్
టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం విషయంలో ఊహించిందే జరిగింది. గుమ్మనూరు జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా, ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్ఠానం ప్రతిపాదించడం పట్ల గుమ్మనూరు జయరాం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలో, నేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేస్తున్నానని, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని గుమ్మనూరు జయరాం ప్రకటించారు. టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇవాళ మంగళగిరి జయహో బీసీ సభ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు.
ఈ నేపథ్యంలో, ఆయనను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మీదట, గవర్నర్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.