Ukraine: నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి
- డ్రోన్లతో దాడి చేయడంతో సముద్రంలో మునిగిపోయిన నౌక
- మానవరహిత నౌకగా ప్రకటించిన ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి
- ఉక్రెయిన్ సైన్యం సత్తా చూపించామన్న అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన ఈ దాడిలో నౌక మునిగిపోయిందని ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి డిమిత్రో ప్లెటెన్చుక్ వెల్లడించారు. రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, డ్రోన్లతో దాడి చేసినట్టు మంగళవారం వివరించారు. షిప్ తీవ్రంగా ధ్వంసమైందని, ముందు భాగం దెబ్బతిందని వివరించారు. 65 మిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. కాగా ఇది మానవ రహిత నౌక అని పేర్కొన్నారు. నల్ల సముద్రాన్ని, అజోవ్ సముద్రాన్ని అనుసంధానించే కెర్చ్ జలసంధికి సమీపంలో ‘సెర్గీ కోటోవ్’ అనే పెట్రోలింగ్ నౌకపై మగురా వీ5 మారిటైమ్ డ్రోన్లతో దాడి చేసినట్టు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గుర్ తెలిపింది. ఈ ఘటనలో నౌక మునిగిపోయినట్టు పేర్కొంది.
కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం రాత్రి ఒక వీడియోలో ఒక నౌక మునిగిపోయినట్లు చెప్పారు. అయితే వివరాలను ఆయన వెల్లడించలేదు. ఉక్రెయిన్ తన సామర్థ్యాన్ని చూపించిందని వ్యాఖ్యానించారు. తమ సైనికుల సామర్థ్యాలు చూపించామని, నల్ల సముద్రంలో రష్యన్ ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు లేవని, ఇకముందు ఉండవని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.