Premium parking: బెంగళూరులోని మాల్ లో పార్కింగ్ ఫీజు గంటకు రూ.1000
- బెంగళూరులో పెరిగిన ట్రాఫిక్ సమస్య
- ట్రాఫిక్ జామ్ సమస్యను క్యాష్ చేసుకునే పనిలో యూబీ సిటీ మాల్
- పార్కింగ్ ఫీజు రూపంలో భారీగా దండుకుంటున్న వైనం
- నగరంలో 9 ఏళ్లలో రూ.40 నుంచి రూ.1000కి పెరిగిన ఫీజు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను కొన్ని షాపింగ్ మాల్స్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. వాహనాల పార్కింగ్ కోసం కేవలం గంటకు ఏకంగా రూ.1000 వరకు ఫీజు వసూలు చేస్తుండడం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన సైన్ బోర్డులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూబీ సిటీలో వాహనాల పార్కింగ్ ఫీజు తాలూకు ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో పార్కింగ్ ఫీజు గంటకు వెయ్యి రూపాయలు అని ఉండడం మనం చూడొచ్చు.
ఇషాన్ వైష్ అనే ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ''యూబీ సిటీ పార్కింగ్‌లో ఏదైనా ప్రత్యేకత ఉందా, దీనికోసం వారు గంటకు ఏకంగా రూ.1000 వసూలు చేస్తున్నారు'' అని కామెంట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. రాజధాని నగరంలో 2015 వరకు పార్కింగ్ ఫీజు గంటకు కేవలం రూ.40 ఉండేదట. కానీ, వాహనాల సంఖ్య ప్రతియేటా భారీగా పెరుగుతుండడంతో పార్కింగ్ సమస్య వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం పార్కింగ్ బిజినెస్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోందని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.