koneru konappa: బీఎస్పీతో పొత్తు ఎఫెక్ట్... సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప
- బుధవారం సీఎం నివాసంలోనే కలిసిన కోనేరు కోనప్ప
- తనకు తెలియకుండా బీఎస్పీతో పొత్తుపై కోనేరు కోనప్ప అసంతృప్తి
- త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్న కోనప్ప
బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్ప పోటీ చేయగా, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిపై బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు విజయం సాధించారు. తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో... అదీ తనకు మాటమాత్రమైనా చెప్పకుండా పొత్తు పెట్టుకోవడం కోనేరు కోనప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన సీఎంను కలవడం గమనార్హం. మరో వారం పది రోజుల్లో ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకోనున్నారని అంటున్నారు.