Bandi Sanjay: రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి... ప్రధాని మోదీని కలిస్తే తప్పేమిటి?: బండి సంజయ్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్న బండి సంజయ్
- భవిష్యత్తులోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలని సూచన
- కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బీజేపీ నేత
- ఓ గ్రామంలో కల్లు తాగిన బండి సంజయ్... వీడియో పోస్ట్
తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే తప్పేమిటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కేశవపట్నంలో ఆయన ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నారు. భవిష్యత్తులోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలని సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పొత్తు వార్తలపై స్పందించారు. పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కల్లు తాగిన బండి సంజయ్
తన ప్రజాహిత యాత్రలో ఓ గ్రామంలో ఓ గౌడన్న కల్లు పోస్తే బండి సంజయ్ తాగారు. ఆ గౌడన్నను ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 'కల్లు పోసిన మీ ఆప్యాయత... కళ్ల నిండా పొంగిన ప్రేమ... జీవితమంతా మరువలేనిది... గౌడన్నల గుండెలో నాకున్న స్థానం కాపాడుకుంటా... కడదాకా కృతజ్ఞతతో ఉంటా...' అని ట్వీట్ చేశారు.