Rahul Gandhi: మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి: రాహుల్ గాంధీకి ఈసీ సూచన
- గతంలో ప్రధాని మోదీని పనౌతి, పిక్ పాకెట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన బీజేపీ
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన
బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన గతంలో పనౌతి (దురదృష్టవంతుడు), పిక్ పాకెట్ వంటి విమర్శలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ... రాహుల్ గాంధీకి సూచనలు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది.
ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్ 24న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. రాజస్థాన్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత బార్మర్ ర్యాలీలో మాట్లాడుతూ... జేబుదొంగ ఒంటరిగా రాడని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. హిందు-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టిని మోదీ మరల్చుతాడని, వెనుక నుంచి అదానీ వచ్చి డబ్బులు తీసుకుంటాడన్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న ఢిల్లీ హైకోర్టు... కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాల్సిన అడ్వైజరీని చూసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ సూచించింది.