Ravichandran Ashwin: టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో మరో అద్వితీయ రికార్డు

Team India Top Bowler Ravichandran Ashwin becomes 14th Indian to play 100 Test matches
  • నేటి ధర్మశాల మ్యాచ్ అశ్విన్‌కు వందో టెస్టు
  • శతక టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌గా రికార్డు
  • 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రవిచంద్రన్ అశ్విన్
  • కుంబ్లే తర్వాత 500 వికెట్లు సాధించిన రెండో ఇండియన్‌గా ఘనత
రికార్డులు కొల్లగొడుతూ తనకు తానే సాటి అనిపించుకుంటున్న టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్‌కి ఇది కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఫలితంగా శతక టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. 99 టెస్టుల్లో 507 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 116 వన్డేల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. 65 టీ20ల్లో 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 35 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా, 8సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టాడు.

స్వదేశంలో అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
అశ్విన్ 2011లో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాతి నుంచి భారత టెస్టు జట్టులో ప్రధాన బౌలర్‌గా మారాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన అనిల్ కుంబ్లే రికార్డును బద్దలుగొట్టాడు. స్వదేశంలో 350 టెస్టు వికెట్ల మార్కును ఎప్పుడో దాటేశాడు. రాజ్‌కోట్‌ టెస్టులో 500 వికెట్ల మార్కును దాటేసి అనిల్ కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన 9వ బౌలర్ అశ్వినే. అతడి కంటే ముందు ముత్తయ్య మురళీధరన్, షేన్‌వార్న్, జేమ్స్ అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్, కుంబ్లే, గ్లెన్ మెక్‌గ్రాత్, కోట్నీ వాల్స్, నాథన్ లయన్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు.

ఇంగ్లండ్‌ పై ఆ రికార్డు అశ్విన్‌కే సొంతం
టెస్టుల్లో ఇంగ్లండ్‌పై  1000కిపైగా పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ అశ్వినే. ఓవరాల్‌గా నాలుగో ఆటగాడు. అతడికంటే ముందు గ్యారీ సోబర్స్, మాంటీ నోబుల్, జార్జ్ జిఫెన్ ఉన్నారు. కాగా, అశ్విన్‌తోపాటు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోకు కూడా నేటి మ్యాచ్ వందోటెస్టే. ఈ ఘతన అందుకున్న 17వ ఇంగ్లిష్ క్రికెటర్‌గా బెయిర్‌స్టో రికార్డు అందుకున్నాడు. నేటి ధర్మశాల టెస్టుకు ముందు బెయిర్‌స్టో 5,974 పరుగులు చేశాడు. 

దిగ్గజాల సరసన
నేటి టెస్టుతో అశ్విన్ భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), విరాట్ కోహ్లీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), పుజారా (103) సరసన చేరాడు.
Ravichandran Ashwin
Team India
Team England
Dharmashala Test

More Telugu News