KTR: కరీంనగర్‌పై చర్చిద్దామా? డేట్, టైమ్ ఫిక్స్ చేయ్... ప్లేస్ మాత్రం అదే: బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్
- కరీంనగర్‌కు ఎవరేం చేశారో చర్చిద్దామన్న కేటీఆర్
- కరీంనగర్ కమాన్ వద్దనే నీ బతుకేందో తెలియాలని వ్యాఖ్య
- నీకు ఎందుకు ఓటేయాలని సంజయ్ కు ప్రశ్న
- పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
బండి సంజయ్... కరీంనగర్‌కు ఎవరేం చేశారో చర్చిద్దామా? డేట్, టైమ్ నువ్వే ఫిక్స్ చెయ్... ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. వినోద్ కుమార్ చర్చకు వస్తారని తెలిపారు. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని విమర్శించారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ అడ్డిమారి గుడ్డిదెబ్బగా గెలిచారన్నారు. ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.
గత పదేళ్లలో అయిదేళ్ళు వినోద్ కుమార్, మరో అయిదేళ్లు బండి సంజయ్ ఎంపీలుగా ఉన్నారని... ఎవరేం చేశారో చూద్దామా? అని నిలదీశారు. అయిదేళ్లుగా ఇక్కడకు వచ్చి కేసీఆర్‌ను తిట్టుడు... సోల్లు వాగుడు తప్ప ఏమైనా చేశావా? అన్నారు. సైకో లెక్క అరుస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ఎంపీగా ప్రధాని మోదీని పట్టుకొని ఈ పని చేశానని చెప్పే దమ్ముందా? అన్నారు. అలాంటప్పుడు నీకు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు. కరీంనగర్ కమాన్ వద్దనే నీ బతుకేందో తెలియాలన్నారు.
పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీ ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేతకాని నువ్వు అసలు ఎంపీగా ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. దేశం కోసం... ధర్మం కోసం అని చెబుతుంటాడని... అలా అయితే మఠం పెట్టుకోవాలని సూచించారు. ఎంతోమంది స్వామీజీలు అన్నీ త్యజించి పని చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ బండి సంజయ్‌కి మాత్రం అలా వద్దట.. అధికారం కావాలి... అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలని విమర్శించారు. పైగా అడిగితే ధర్మం కోసమని పోజులు అని మండిపడ్డారు. మన కోసం పని చేసే వినోదన్నను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరమంతా ఎన్నికలే ఉంటాయని... పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని గుర్తు చేశారు. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మాదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీ అందరికీ మాట ఇస్తున్నానన్నారు. ఈ రోజు అభ్యర్థుల గెలుపు కోసం ఎలాగైతే కష్టపడి తిరుగుతున్నారో... రేపు మీ కోసం అంతకంటే ఎక్కువగా పని చేసే బాధ్యత మాదే అన్నారు. ఊరూరా తిరిగే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.