Upasana Kamineni Konidela: జీవితంలో స్థిరపడ్డాక పిల్లలు కందాం అనుకునేవారు ఈ పని చేయాలి: ఉపాసన
- మార్చి 8న ఉమెన్స్ డే
- ఓ నేషనల్ మ్యాగజైన్ కు రామ్ చరణ్, ఉపాసన ఇంటర్వ్యూ
- పిల్లలు పుట్టగానే కొందరు మహిళలు ఉద్యోగాలు మానేయడం బాధాకరమన్న ఉపాసన
- మహిళల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్ష
రేపు ఉమెన్స్ డే (మార్చి 8) పురస్కరించుకుని టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన ఓ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన మహిళలకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
పిల్లలు పుట్టగానే కొందరు మహిళలు ఉద్యోగాలు మానేస్తుంటారని, ఇది బాధాకరమని అన్నారు. పిల్లలను కన్నాక మునుపటిలా పనిచేయలేమని, ఎంత ప్రయత్నించినా పనిచేయలేకపోతున్నామని చాలా మంది మహిళలు చెబుతుంటారని, అలాంటి వారి ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఉపాసన స్పష్టం చేశారు.
అదే సమయంలో, సంస్థలు కూడా మహిళలకు అనుకూలమైన విధానాలను అమలు చేయాలని సూచించారు. మాతృత్వపు సెలవులు, ఇతర ఆరోగ్య కారణాలరీత్యా సెలవులు... తదితర అంశాలపై మహిళా ఉద్యోగులకు స్వేచ్ఛ కల్పించడం కంపెనీల బాధ్యత అని పేర్కొన్నారు. దీనిపై తాను పలు కంపెనీలతో మాట్లాడుతున్నానని వెల్లడించారు.
ఇక, తాను ఎప్పుడు తల్లి కావాలనే అంశంపై ఓ మహిళ ఆలోచనలకు విలువ ఇవ్వాలని ఉపాసన అభిప్రాయపడ్డారు. జీవితంలో స్థిరపడ్డాక పిల్లలు కందామని భావించే మహిళలు తమ అండాలను భద్రపరుచుకోవాలని, అండాలకు బీమా చేయించుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడు ఆ అండాల సాయంతో తల్లి కావొచ్చని వివరించారు.
తాను కూడా అండాలు భద్రపరుచుకున్నానని, తగిన సమయం అనుకున్నప్పుడే క్లీంకారను కన్నామని ఉపాసన వెల్లడించారు. అండాలు భద్రపరుచుకోవడం, ఆర్థిక భద్రత ఉన్నప్పుడే పిల్లలను కనడం వంటి విధానాలు మహిళలకు ఉపయుక్తంగా ఉండడమే కాదు, దేశ అభ్యున్నతికి కూడా దోహదపడతాయని అన్నారు.