Shehbaz Sharif: ప్రధాని మోదీకి పాక్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు
- రెండోసారి పాక్ ప్రధానిగా ప్రమాణం చేసిన షెహబాజ్
- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
- ఎక్స్ వేదికగా స్పందించిన షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా తిరిగి రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన షెహబాజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పాకిస్థాన్ ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన వేళ అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’’ అంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ ఒక పోస్ట్ పెట్టారు. పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్‌కు మోదీ మంగళవారం అభినందనలు తెలిపారు. కాగా పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలో షెహబాబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఆటలో భాగం కానివ్వబోనని అన్నారు. సమానత్వం ప్రాతిపదికన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. అయితే కశ్మీర్ సమస్యను లేవనెత్తిన ఆయన పాలస్తీనా సమస్యతో పోల్చడం గమనార్హం. కాగా 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై పాక్ తీవ్రవాద గ్రూపులు దాడులు జరిపిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార దాడి చేసింది. ఫిబ్రవరి 26, 2019న పాక్‌లోని జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి.