Madhavi Latha: హైదరాబాద్ ఎంపీ టిక్కెట్ మాధవీలతకు ఇవ్వడంపై కరాటే కల్యాణి స్పందన
- మాధవీలతకు టిక్కెట్ ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడి
- ఓ మహిళకు టిక్కెట్ ఇవ్వడం ఆనందమే.. కానీ ఆమె టిక్కెట్ కోసమే ప్రచారం చేసుకున్నారని ఆరోపణ
- తాను బీజేపీ నుంచి తెలంగాణలో పోటీ చేయాలని భావించడం లేదని స్పష్టీకరణ
- బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని వెల్లడి
హైదరాబాద్ లోక్ సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ... డాక్టర్ కొంపెల్ల మాధవీలతకు ఇవ్వడంపై ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు. మాధవీలతకు టిక్కెట్ ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ నుంచి తెలంగాణలో పోటీ చేయాలని భావించడం లేదన్నారు. బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని వెల్లడించారు.
అదే సమయంలో టిక్కెట్ల కేటాయింపుపై రాష్ట్ర నాయకత్వంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి టిక్కెట్లు ఇవ్వకుండా షో చేస్తున్న వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఓ మహిళకు టిక్కెట్ ఇవ్వడం ఆనందమేనని మాధవీలతను ఉద్దేశించి అన్నారు. కానీ టిక్కెట్ కోసమే ఆమె పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నట్లుగా తెలుస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలు ఉన్నాయన్నారు. కష్టపడిన వారిని అధిష్ఠానం వరకు వెళ్లకుండా చూస్తున్నారన్నారు.