Chegondi Harirama Jogaiah: సంచలన నిర్ణయం తీసుకున్న హరిరామజోగయ్య... కాపు సంక్షేమ సేన రద్దు
- ఇటీవల పరిణామాలతో మనస్తాపం చెందిన హరిరామజోగయ్య
- పవన్ వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని భావిస్తున్న వైనం
- ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి
- రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతానని స్పష్టీకరణ
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గ పెద్ద, సీనియర్ రాజకీయనేత చేగొండి హరిరామజోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు. ఇకపై రాజకీయాల్లో జోక్యం చేసుకోనని, రాజకీయ విశ్లేషకుడిగానే ఉంటానని స్పష్టం చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలకు అంగీకరించడం హరిరామజోగయ్యను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయన లేఖలు కూడా రాశారు. సలహాలు ఇచ్చేవాళ్లు వైసీపీ కోవర్టులు అంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా, ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనని హరిరామజోగయ్య భావిస్తున్నారు.
ఇటీవలే హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరారు. హరిరామజోగయ్య కూడా అదే బాట పడతారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ, తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని నేడు హరిరామజోగయ్య ప్రకటించారు.