Rohit Sharma: ధర్మశాలలో సెంచరీతో సచిన్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
- వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచిన హిట్‌మ్యాన్
- చెరో 35 సెంచరీలతో రెండవ స్థానంలో నిలిచిన భారతీయ క్రికెటర్లు
- ధర్మశాల టెస్టులో సెంచరీతో రికార్డు సాధించిన రోహిత్ శర్మ
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ భారీ స్థాయి ఆధిక్యానికి కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ బాదిన సెంచరీలు తోడ్పడ్డాయి. యువ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్‌ల చక్కటి సహకారం కూడా కలిసొచ్చింది. కాగా మ్యాచ్‌లో సెంచరీ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు సాధించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమంగా నిలిచాడు.
వయసు 30 ఏళ్లు పైబడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్‌తో సమంగా హిట్‌మ్యాన్ నిలిచాడు. రోహిత్, సచిన్ చెరో 35 సెంచరీలతో 3వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 43 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు. 36 సెంచరీలతో ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ ఉమ్మడిగా రెండవ స్థానంలో నిలిచారు.
30 ఏళ్లు దాటిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లు వీళ్లే..
1. కుమార్ సంగక్కర - 43 సెంచరీలు
2. మాథ్యూ హేడెన్ - 36 సెంచరీలు
3. రికీ పాంటింగ్ - 36 సెంచరీలు
4. రోహిత్ శర్మ - 35 సెంచరీలు
5. సచిన్ టెండూల్కర్ - 35 సెంచరీలు
కాగా ధర్మశాల టెస్టులో సెంచరీతో కెరియర్‌లో 12వ టెస్ట్ సెంచరీని రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. 162 బంతుల్లో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది రెండవ సెంచరీ కావడం విశేషం.