Rameswaram Cafe: జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న ‘రామేశ్వరం కేఫ్’
- బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత పున: ప్రారంభమైన సర్వీసులు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కస్టమర్లు
- భారీ క్యూలైన్ ఏర్పడడంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత బెంగళూరులోని ‘రామేశ్వరం కేఫ్’ తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్‌ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా కేఫ్‌ను పునర్నిర్మించారు. కొన్ని మరమ్మతు పనులు చేపట్టారు. కస్టమర్లకు సురక్షితమైన వాతావరణం కోసం కొన్ని మార్పులు చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు. తమ భద్రతా బృందాన్ని పటిష్ఠం చేస్తున్నామని, సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ సైనికులతో కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా మార్చి 1న బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.