Amit Shah: అమిత్ షా ప్రకటనపై చంద్రబాబు స్పందన
- బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు
- చంద్రబాబు, పవన్ లకు ఎన్డీయేలోకి స్వాగతం పలికిన బీజేపీ పెద్దలు
- ఎన్డీయే అంతకంతకు ఎదుగుతోందన్న అమిత్ షా
- అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు, ఎన్డీయేలో చేరికపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, కలిసివచ్చే అన్ని పార్టీలకు తిరుగులేని వేదికగా నిలుస్తూ ఎన్డీయే అంతకంతకు ఎదుగుతోందని వివరించారు.
ఇవాళ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్డీయేలో చేరాయని అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతున్నామని వివరించారు. వారి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల సాధనను వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
అమిత్ షా ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. "అమిత్ షా గారూ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. మా రాష్ట్ర ఎదుగుదల దేశ అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రజల దీవెనలతో, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాశ్రేయస్సు కోసం నవ శకానికి నాంది పలుకుతాం" అని చంద్రబాబు వివరించారు.