Indiramma houses Scheme: భద్రాచలంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

Indiramma houses scheme lauched today in Bhadrachalam by CM Revanth Reddy
  • శ్రీకారం చుట్టున్న సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట నుంచి భద్రాచలం వెళ్లనున్న సీఎం
  • మధ్యాహ్నం 1 గంటకు పథకం ప్రారంభం
  • షెడ్యూల్ వివరాలు వెల్లడించిన సీఎంవో అధికారులు
ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (సోమవారం) శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలో ఈ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నేరుగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి వెళ్తారు. 

రాములోరి దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. సుమారు 5 వేల మంది మహిళలు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం భద్రాచలంలోనే నీటిపారుదల, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్‌, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మణుగూరులో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 6.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేయనుంది. విడతల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరినీ గర్తించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈ స్కీమ్ కూడా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఈ ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేయనున్నారు.


Indiramma houses Scheme
Revanth Reddy
Telangana
Bhadradri Kothagudem District

More Telugu News