Sachin Tendulkar: వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. సచిన్ ఆసక్తికర ట్వీట్
- పదేళ్ల వయసు ఉన్నప్పుడు వాంఖడేను మొదటిసారి చూశానన్న సచిన్
- 15 ఏళ్లప్పుడు ఇదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం
- ఇక్కడే 2011లో వరల్డ్ కప్ గెలవడం కెరీర్ బెస్ట్ మూమెంట్‌గా పేర్కొన్న మాస్టర్ బ్లాస్టర్
- వాంఖడేలోనే 200వ టెస్ట్ మ్యాచ్.. ఆటకు వీడ్కోలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. "నాకు పదేళ్లు ఉన్నప్పుడు మొదటిసారి వాంఖడే స్టేడియాన్ని చూశా. కానీ, ఐదేళ్ల తర్వాత ఇదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం చేస్తానని అనుకోలేదు. 15 ఏళ్లప్పుడు ఇదే స్టేడియంలో మొదటిసారి గుజరాత్‌పై ఆడా. 2011లో నా దేశం కోసం వరల్డ్ కప్‌ను గెలవడం నా కెరీర్‌లో మరిచిపోలేని క్షణాలు. ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్‌నూ ఆడా. ఇదే మైదానంలో నాకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికా.. అందుకే, వాంఖడే నాకు మరో ఇల్లు లాంటిది" అని సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇక సచిన్ తన 24ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడాడు. టెస్ట్‌లలో 15,921 పరుగులు, వన్డేలలో 18,426 పరుగులు చేశాడు. అలాగే ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 100 శతకాలు బాదాడు. వీటిలో టెస్టుల్లో 51, వన్డేలలో 49 సెంచరీలు ఉన్నాయి.