Lieutenant Inayat Vats: తండ్రి యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి!

Her Father Died In JandK 20 Years Ago She Now Joins Army Wearing His Uniform
  • 2003లో మేజర్ నవ్‌నీత్ వాట్స్ శ్రీనగర్‌లో మృతి
  • తాజాగా ఆర్మీలో లెఫ్టెనెంట్‌గా చేరిన నవ్‌నీత్ కుమార్తె ఇనాయత్
  • తండ్రి యూనిఫాంలో పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరు
  • ఇనాయత్ ఫోటోను షేర్ చేస్తూ నెట్టింట ఆర్మీ పోస్ట్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి ఓ యువతి ఆర్మీలో చేరారు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ దేశసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం మేజర్ నవ్‌నీత్ వాట్స్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ అమరుడయ్యారు. అయితే తండ్రి దేశభక్తిని పుణికిపుచ్చుకున్న ఆయన కుమార్తె ఇనాయత్ వాట్స్ సైన్యంలో ఎంపికయ్యారు. 

ఇటీవల చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో ఆమె విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం, మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టెనెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి హాజరయ్యారు. ఆమెకు స్వాగతం పలుకుతూ ఇండియన్ ఆర్మీ నెట్టింట ఓ పోస్టు పెట్టింది. ‘‘ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్‌కు స్వాగతం’’ అని ట్వీట్ చేసింది. 

ఇనాయత్ తండ్రి మేజర్ నవ్‌నీత్ వాట్స్ స్వస్థలం చండీగఢ్. 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో ఆయన విధులు నిర్వర్తించేవారు. 2003 నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో ఆయన అమరుడయ్యారు. అప్పటికి ఇనాయత్ వయసు మూడేళ్లు. దేశసేవలో ప్రాణాలర్పించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్‌ను ప్రభుత్వం సేనా మెడల్‌తో సత్కరించింది. 

ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు.
Lieutenant Inayat Vats
Indian Military
Chennai Officers training Academy
Passing Out Parade

More Telugu News