CM Revanth Reddy: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
- ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
- స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం
- సీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి రేవంత్ రెడ్డి
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్లడంతో ప్రొటోకాల్ సమస్యలు రాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించడం జరిగింది.