Revanth Reddy: సిగ్గులేనోడా... హామీల గురించి నీ అయ్యని అడిగావా?: కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
- మణుగూర్ ప్రజాదీవెన సభలో బీఆర్ఎస్ అగ్రనాయకులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ గాడిద కొడుకులు వారిని పలకరించారా? అని తీవ్ర వ్యాఖ్య
- హరీశ్ రావు దూలం లెక్క పెరిగాడు కానీ దూడకు ఉన్న బుద్ధి కూడా లేదని ఎద్దేవా
- కేసీఆర్ అంటే చార్లెస్ శోభరాజ్ అన్న రేవంత్ రెడ్డి
సిగ్గులేనోడా కేటీఆర్... మేం అమలు చేస్తున్న హామీల గురించి అడుగుతున్నావ్.. కానీ ఎప్పుడైనా మీ అయ్యను మీరు ఇచ్చిన హామీల గురించి అడిగావా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. మణుగూరులో కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పదేళ్లయినా మీరు హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కానీ తాము తొంబై రోజుల్లో పలు గ్యారెంటీలు అమలు చేశామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ గాడిద కొడుకులు వారిని పలకరించారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హరీశ్ రావు దూలం లెక్క పెరిగాడు కానీ దూడకు ఉన్న బుద్ధి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇక ఆయన బావమరిది చాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించి పేడమూతి బోడి లింగం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరె సన్నాసీ... మీ ఇద్దర్నీ బిల్లా, రంగాలు అంటున్నాం.. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి రా... దొంగలు రా... తోడుదొంగలు రా... ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టిన దొంగలు రా... మీ అయ్య చార్లెస్ శోభరాజ్ రా... కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీశారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు తాగునీరు లేకుండా చేసిన దరిద్రులారా అని తీవ్రపదజాలం వాడారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. బీజేపీ తొమ్మిది స్థానాల్లో, బీఆర్ఎస్ నాలుగు సీట్లలో అభ్యర్థులను ప్రకటించారని కానీ వారు ప్రకటించిన చోట వీరు... వీరు ప్రకటించిన చోట వారు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. ఎందుకంటే వారు ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌లో గతంలో నీ బిడ్డ కవిత పోటీ చేస్తే... ఇప్పుడు ఇంకా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించారు. నీ బిడ్డను నిజామాబాద్ ప్రజలు మరోసారి బండకేసి కొడతారని అనుమానం వచ్చి ప్రకటించలేదా? అని నిలదీశారు. ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ కొడుకుకు సికింద్రాబాద్ టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కలిసి కనిపిస్తే చెప్పుతో కొడతారని చీకట్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు.
గెలుపుకు కారణం కార్యకర్తలే
మన మధ్య రక్తసంబంధం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ జెండాను మీ భుజాలపై మోసి ఉమ్మడి ఖమ్మంలో పదింట తొమ్మిది సీట్లు గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ అద్భుత విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమన్నారు. కాంగ్రెస్ కోసం కొట్లాడింది... అధికారంలోకి తెచ్చింది.. కార్యకర్తలే అన్నారు. కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని ప్రశంసించారు. అందరూ కొట్లాడి సాధించిన తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తాను ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడూ నమ్మలేదన్నారు. కానీ ఈ జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి చెందిన రేణుకా చౌదరి, బలరాం నాయక్ వంటి నేతలకు ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ జిల్లా నుంచి తమ కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. భద్రాచల శ్రీరామచంద్రుడి ఆశీస్సులతోనే తాము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించారని, బలరాం నాయక్‌కు మహబూబాబాద్ స్థానం కేటాయించారని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కచ్చితంగా గెలవబోతుందని జోస్యం చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి... ప్రతి తలుపు తట్టి... ప్రతి గుండెకు చేరేలా సోనియమ్మ మాటలను చెప్పాలన్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే మడమ తిప్పరన్నారు. గత మూడు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని విమర్శించారు.
ఆడబిడ్డలకు సోనియా గాంధీ దీపం పథకం కింద సిలిండర్ ఇస్తే... మోదీ అధికారంలోకి వచ్చాక ధరలు పెంచిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా అందిస్తున్నామన్నారు. తాము 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంటే కేసీఆర్ కుటుంబ తమపై శాపనార్థాలు పెడుతోందని మండిపడ్డారు.