Richard Kettleborough: భారతీయుడికి ఓ పాకిస్థానీ సాయం చేయడం ఇదే ఆఖరు అనుకుంటా: అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో
- ఇటీవల ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా
- భారత్ పై ఎప్పటి నుంచో అక్కసు వెళ్లగక్కుతున్న ఇంగ్లండ్ మాజీలు
- తాజాగా టీమిండియాపై విషం చిమ్మే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ అంపైర్
ఇటీవల కాలంలో టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. వారి కడుపు మంట మరింత ఎక్కువయ్యేలా ఇటీవల టీమిండియా జట్టు ఇంగ్లండ్ ను టెస్టు సిరీస్ లో చితక్కొట్టింది. ఆటగాళ్లే అనుకుంటే ఇంగ్లండ్ కు చెందిన ఇంటర్నేషనల్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో కూడా భారత్ పై విషం కక్కే ప్రయత్నం చేశాడు.
అసలేం జరిగిందంటే... గతంలో ఆస్ట్రేలియా జట్టు రికీ పాంటింగ్ కెప్టెన్సీలో భారత్ లో పర్యటించింది. ఓ టెస్టు మ్యాచ్ టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో కట్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, ఆ బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. అది అవుట్ అంటూ ఆసీస్ జట్టు బిగ్గరగా అప్పీల్ చేసినా, అంపైర్ అసద్ రవూఫ్ అవుట్ ఇవ్వలేదు.
దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్న ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో... "ఓ పాకిస్థానీ వ్యక్తి ఒక భారతీయుడికి సాయం చేయడం ఇదే ఆఖరు అనుకుంటా" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వాస్తవానికి ఇది దాదాపు రెండు దశాబ్దాల నాటి వ్యవహారం. రిచర్డ్ కెటిల్ బరో దీన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం అతడి అల్పబుద్ధికి నిదర్శనం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.