Kodi Kathi Srinu: రాజకీయాల్లోకి కోడికత్తి శ్రీను.. అమలాపురం నుంచి పోటీ
- జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు శ్రావణ్ కుమార్
- పేదల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పిన శ్రీనివాసరావు
- పులివెందుల నుంచి జగన్పై దస్తగిరి పోటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. గతరాత్రి ఆయన ‘జైభీమ్ భారత్’ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో, మతం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు తీర్చాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దగాపడిన శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చెప్పారు. పులివెందుల నుంచి తమ పార్టీ తరపున జగన్పై దస్తగిరి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.