Vande Bharat Mission Express Rail: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు
- కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ప్రెస్ కూడా నేడే పరుగులు
- వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ
- రూ. 85 వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
- పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు చేతివృత్తుల కేంద్రాల ప్రారంభం
విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఓ రైలు సేవలు అందిస్తోంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలుతోపాటు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
జాతికి అంకితం చేసేవి ఇవే
దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.. పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వంటివి ఉన్నాయి. అలాగే, 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులు ప్రారంభిస్తారు.
అలాగే, వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్ కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో 193 చేతి వృత్తుల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తారు. వీటిలో తెలంగాణ పరిధిలో 55, ఏపీలో 111, మహారాష్ట్రలో 27 దుకాణాలు ఉన్నాయి.