Pawan Kalyan: సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యంగా మూడు పార్టీలు ముందడుగు వేశాయి: పవన్ కల్యాణ్
- మోదీ దార్శనిక నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయన్న పవన్
- రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందని వ్యాఖ్య
- రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్న జనసేనాని
ప్రధాని నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పని చేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందని అన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని మూడు పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయని చెప్పారు.
ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందనేది తమ ప్రగాఢ విశ్వాసమని అన్నారు. ఎన్డీయే భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు జయంత్ పాండా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.