Kishan Reddy: హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. బీఆర్ఎస్ కు ఓటు వేసినా వేస్టే: కిషన్ రెడ్డి
- వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయన్న కిషన్ రెడ్డి
- మొత్తం 17 ఎంపీ స్థానాల్లో సత్తా చాటుతామని ధీమా
- బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయమే అని విమర్శ
వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో సత్తా చాటుతామని... సికింద్రాబాద్ స్థానంలో కూడా గెలుస్తామని చెప్పారు. దేశ ప్రధాని ఎవరో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాన మోదీ సుస్థిరమైన పాలన అందించారని చెప్పారు. లోక్ సభ ఎన్నికలపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసేందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చారని తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కు అమిత్ షా మార్గనిర్దేశం చేశారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సోషల్ మీడియా కేడర్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి చెప్పారు. తమ దృష్టిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేసినా వేస్టేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయంగానే ఉందని విమర్శించారు.