Electoral Bonds: ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సమర్పించిన ఎస్‌బీఐ
- ఎలక్టోరల్ బాండ్స్ వివరాల సమర్పణకు అదనపు సమయం కోరిన ఎస్బీఐపై సుప్రీం గుస్సా
- సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈసీకి బాండ్స్ వివరాలు అందజేసిన ఎస్బీఐ
- దశలవారీగా ఈసీ వెబ్‌సైట్‌లోకి ఈ వివరాల అప్‌లోడ్
- మార్చి 15 కల్లా సమాచారం ప్రజల ముందుకొచ్చే ఛాన్స్
ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం సమర్పించినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఏ పార్టీ కోసం ఎవరెవరూ ఈ బాండ్స్ కొన్నదీ ఎస్బీఐ ఈసీకి నివేదించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమాచారమంతా రా డేటాగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని మరింత సరళీకరించాలని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ వివరాలను దశలవారీగా ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, మార్చి 15 కల్లా సమాచారం మొత్తాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ఈసీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఎన్నికల బాండ్లకు చట్టబద్ధత లేదని తీర్పు వెలువరించింది. ఇప్పటివరకూ జారీ అయిన బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఇందుకు మరికొంత సమయం కావాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎస్బీఐపై సుప్రీం మండిపడింది. కావాలనే తమ ఆదేశాలను అమలు చేయట్లేదని భావించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని హెచ్చరించిన న్యాయస్థానం.. మార్చి 12 లోపు ఆ వివరాలను ఈసీకి సమర్పించాలని ఆదేశించింది. గత్యంతరం లేక ఎస్బీఐ సుప్రీం ఆదేశాలకు తలొగ్గింది.
రాజకీయ పార్టీలు పారదర్శకంగా నిధులు సేకరించేందుకు 2018లో ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బాండ్లను ఎస్బీఐ జారీ చేస్తుంది. నాటి నుంచి ఇప్పటివరకూ ఎస్బీఐ మొత్తం రూ.16,518 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను 30 విడతల్లో జారీ చేసింది. అయితే, బాండ్లు ఎవరు కొన్నదీ, ఏ పార్టీ కోసం కొన్నదీ మొదలైన వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఇది ప్రజల సమాచార హక్కుకు భంగమని వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని ఇటీవల రద్దు చేసింది.