AI scam: ఏఐ వాయిస్ కాల్ స్కామ్.. సైబర్ నేరస్థుల కొత్త ఎత్తుగడ
- ఆపదలో ఉన్నానంటూ కుటుంబ సభ్యుల గొంతుతో ఫోన్ కాల్
- అందినకాడికి డబ్బులు గుంజేందుకు ప్రయత్నం
- తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ అలర్ట్ చేసిన ఓ ట్విట్టర్ యూజర్
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం..? ఎలాగైనా సరే వారిని కాపాడుకోవాలనే చూస్తాం.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చయినా పోతే పోయిందిలే అనుకుంటాం కదా.. సరిగ్గా ఈ భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో సైబర్ నేరస్థులు కొత్త మోసానికి తెరలేపారు. స్కూలుకో, కాలేజీకో వెళ్లిన కూతురు లేదా కొడుకు గొంతును అనుకరిస్తూ ‘మమ్మీ నేను ఆపదలో ఉన్నా.. కాపాడు ప్లీజ్’ అంటూ ఏఐ సాయంతో ఫోన్ చేస్తారు. ఆపై మీ దగ్గరి నుంచి అందినకాడికి వసూలు చేసి కాల్ కట్ చేస్తారు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక కానీ మీరు మోసపోయిన విషయం తెలియదు. ఇటీవల ఓ మహిళ తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని ట్విట్టర్ లో పంచుకుంది.
కావేరీ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ ప్రకారం..
ఓ రోజు మధ్యాహ్నం పూట కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సాధారణంగా కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్ ను అటెండ్ చేయను కానీ ఈ కాల్ ను ఆన్సర్ చేశా.. ఎందుకలా చేశానో తెలియదు. కాల్ లో అవతలి వైపున్న అపరిచితుడు తనను తాను ఓ పోలీస్ ఆఫీసర్ నని పరిచయం చేసుకున్నాడు. మీ అమ్మాయిని, ఆమె స్నేహితులు మరో ముగ్గురిని కలిపి అరెస్టు చేశామని చెప్పాడు. వారంతా కలిసి ఆన్ లైన్ లో ఓ యువకుడిని ఛీట్ చేశారని ఆరోపించాడు. మీ కూతురుతో మాట్లాడండి అంటూ ఫోన్ వేరే వారికి అందించాడు. కొన్ని క్షణాల తర్వాత ‘మమ్మీ నన్ను కాపాడు ప్లీజ్’ అంటూ ఓ అమ్మాయి గొంతు వినిపించింది.
ఆ వాయిస్ మా అమ్మాయి గొంతులానే ఉంది కానీ కొద్దిగా అసహజంగా అనిపించింది. ఇంతలో మళ్లీ ఫోన్ తీసుకున్న అపరిచితుడు.. మీ అమ్మాయిని స్టేషన్ కు తీసుకెళ్లకుండా వదిలేయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తే అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడు. అయితే, అప్పటికే ఇదొక స్కామ్ అని గుర్తించి ఫోన్ పెట్టేశాను. ఇలాంటి ఫోన్ కాల్ మీకూ రావొచ్చు. కాస్త అలర్ట్ గా ఉండండి, ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు స్థిమితంగా ఆలోచించండి అంటూ కావేరీ అనే ట్విట్టర్ యూజర్ చెప్పారు.