Kalalaku Rekkalu: ఆడపిల్లల కోసం 'కలలకు రెక్కలు' పథకం... ప్రారంభించిన చంద్రబాబు
- ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిల ఉన్నత చదువులకు ఉపయోగపడే పథకం
- బ్యాంకు లోన్లకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందన్న చంద్రబాబు
- ఆ రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడి
ఆడపిల్లల ఉన్నతవిద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకికారాదన్న ఉద్దేశ్యంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొత్తగా 'కలలకు రెక్కలు' పథకంకు రూపకల్పన చేసింది. అధికారంలోకి వచ్చాక అమలు చేసే ఈ పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు చేయనున్నారు.