Mohammed Siraj: నాలుగేళ్ల కిందటే క్రికెట్ వదిలేద్దామనుకున్నా.. తొలి రోజుల్లో క్యాటరింగ్ పనులు చేశా: సిరాజ్
- నేడు 30వ పుట్టినరోజును జరుపుకుంటున్న సిరాజ్
- జన్మభూమి హైదరాబాద్ కు వచ్చానన్న సిరాజ్
- ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని వెల్లడి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు 30వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ కు బీసీసీఐతో పాటు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిరాజ్ పోస్ట్ చేసిన ఓ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
"మళ్లీ నేను నా జన్మభూమి హైదరాబాద్ కు వచ్చా. నేరుగా ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి నేను తొలిసారి క్రికెట్ ఆడిన మైదానానికి వెళ్లా. ఎక్కడకు వెళ్లినా రాని ప్రశాంతత ఇక్కడకు వస్తే వచ్చేస్తుంది. క్రికెటర్ గా నేను తొలిసారి ఇక్కడే అడుగుపెట్టా.
నాన్న ఆటో రిక్షా తోలుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దీంతో, ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. తొలి రోజుల్లో క్యాటరింగ్ పనులు చేసేవాడిని. పని చేసిన రోజుల్లో రూ. 200 సంపాదించినా ఎంతో సంతోషం కలిగేది. రూ. 50 ఉంచుకుని మిగతా డబ్బు ఇంట్లో ఇచ్చేవాడిని. ఒక రోజు రుమాలీ రోటీ చేస్తుంటే చేతులు కాలాయి. ఇలాంటి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా.
టెన్నిస్ క్రికెట్ ఎక్కువగా ఆడటం పేస్ ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది. కఠినంగా శ్రమిస్తే ఏదో ఒక రోజు ఫలితం దక్కుతుంది. నాలుగేళ్ల క్రితం క్రికెట్ వదిలేద్దామనుకున్నా. సక్సెస్ కాకపోతే అదే నా చివరి సంవత్సరం అనుకున్నా. అయితే ఫామ్ లోకి రావడంతో జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నా" అని సిరాజ్ తెలిపాడు.